హైదరాబాద్: యాదవుల ప్రతిష్టాత్మక పండుగైన సదర్ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నవంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న సదర్ సమ్మేళనానికి అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి శ్రీకృష్ణ సదర్ కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సదర్ సమ్మేళనానికి హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సదర్ పండుగ యాదవులకు ఎంతో ప్రతిష్టాత్మకమైందన్నారు. శ్రీకృష్ణ సదర్ కమిటీ ఫౌండర్ చైర్మన్ మందాడి అంజన్ కుమార్ యాదవ్ గత 20 ఏళ్లుగా అన్ని కులాలు, వర్గాల వారిని కలుపుకొని ఈ సమ్మేళనాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ ఒకచోట చేరి ఆప్యాయంగా పలకరించుకుంటూ, అలాయ్ బలాయ్ చేసుకుంటూ సంతోషంగా జరుపుకునే గొప్ప పండుగ సదర్ అని అన్నారు.
శ్రీకృష్ణ భగవానుడి ఆగమన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరారు. సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
భారీగా ఆగమన కార్యక్రమం..
శ్రీకృష్ణ సదర్ కమిటీ ఫౌండర్ చైర్మన్ మందాడి అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రేపు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించనున్న సదర్ ఆగమన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆవులు, దున్నపోతులను తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా ఆగమనం నిర్వహిస్తామని వెల్లడించారు. పూజా కార్యక్రమం సందర్భంగా భారీ డీజే బ్యాండ్లు, టపాసులతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
నవంబర్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సదర్ సమ్మేళనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి తేజస్వి యాదవ్, ధర్మేంద్ర యాదవ్ వంటి ముఖ్య నాయకులను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అంజన్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. యాదవ సంఘాల నాయకులు సంఘీభావంతో పాల్గొనాలని కోరారు. దున్నపోతుల ఊరేగింపు జరిగే బస్తీలతో పాటు అన్ని కులాల ప్రజలు ఈ జూలూస్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సదర్ సమ్మేళనానికి వచ్చే అతిథులందరికీ ఆతిథ్యం అందించడంతో పాటు భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలు హాజరై ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సదర్ సమ్మేళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
